మధ్యాహ్నం 2 గంటల 5 నిమషాలు కావొస్తుంది. కొద్ది కొద్దిగా నిద్రా దేవి తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమవుతుంది. నాకు కూడా నిద్ర పోవాలనే ఉంది. కానీ.. మనసులో ఏదో భయం తెలుస్తూ ఉంది. ఏంటా అని ఆలోచిస్తే కొద్ది రోజుల్లో ఖాయం కాబోయే పెళ్లి సంబంధం గురించి అని అర్ధం అయింది. ప్రతీ ఆడపిల్ల ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఉంటుంది. నేను ఎదుర్కొనే సమయం వచ్చినట్టుగా ఉంది. చిన్నప్పటి నుండి నేను ఎదురుచూసిన రాకుమారుడు రాబోతున్నాడు నా జీవితం లోకి. ఎవరైనా ఏదైనా అంటే నా మొగుడు రానీవే చూస్కుంటాను అనే మాటలకూ నిజ రూపం రాబోతుంది. నేను అల్లరి చేసినప్పుడు స్నేహితులు, బంధువులు అన్నట్టు నా అల్లరికి ముక్కుతాడు వేయడానికి వచ్చాడా?.. ఏమో...
ఊహ తెలిసినప్పటి నుండి నేను ఊహించిన ఊహలకు కళ్ళెం వేస్తూ ఇదిగో నా రూపం అంటూ వచ్చాడు. ఇన్ని రోజులు ఊహాలోకం లో విహరించిన నేను అతను ఎదురు పడగానే ఎందుకు తడబడుతున్నాను .. మనసు చెప్తుంది ఇన్ని రోజులు తను కలలో చూపించిన రాజసాన్ని గురించి చెప్పు.. తన గురించి నువ్వు కన్న కలలను గురించి చెప్పు.. అదీ .. ఇదీ.. అని.. నాలిక కదులుతుంది.. కానీ శబ్దం వినబడదే... !!?? చిన్నప్పుడు చదివాను ఆక్టోపస్ కి చేతికి ఒకటి చొప్పున మెదడు ఉంటుంది అని.. సినిమా లో చూసాను, ఒకే మనిషిలో ఇదరు ముగ్గురు వేరు వేరు మనుషులు ఉంటారని.. అదంతా కల్పితం అనుకునేదాన్ని.. కానీ.. ఇప్పుడు నా మెదడు కి మనసుకి జరుగుతున్న యుద్దం లో నేను నలిగిపోతుంటే తెలుస్తుంది.. కాని నా కళ్ళు, ఇంకా మేము ఉన్నాము అంటూ హామీ ఇచ్చి, మేము కూడా రాయభారాన్ని మోయగలం, మమ్మల్నీ మధుర క్షణం లో భాగస్వాముల్ని చెయ్యు అంటూ నా భావాన్ని చేరవేసాయి...
ఓహ్.... నా కళ్ళకి ఏదో వినిపిస్తుంది... ఇన్ని రోజులు నేను ఎదురు చూసిన నా కలల రాణి వి నీవేనా అని అడుగుతున్నారు.. కళ్ళు కూడా వినగలుగుతున్నాయని తెలిసిన క్షణం ఎంత మధురమో కదా.. ఇలాంటి మధుర క్షణాలు ఇంకా ఎన్నో ముందు ముందు ఉంటాయని ఊహించిన క్షణం.. సిగ్గమ్మ నేనున్నాను అంటూ వచ్చి బుగ్గలపై తిష్ట వేసి కూర్చుంది.. ఎంతకీ కదలదే....
భయం కూడా నేను ఉన్నాను అంటూ మెదడుని తొలుస్తుంది.. కొత్త ఇల్లు.. కొత్త ప్రదేశం.. కొత్త మనుషుల మధ్యలోకి వెళ్ళబోతున్నాను.. వాళ్ళు ఎలా ఉంటారో.. నన్నేలా చూస్కుంటారో.. నేనెలా చూస్కుంటానో... అన్నింటి కంటే పెద్దది.. అమ్మ వాళ్ళని వదిలేసి వెళ్ళాలి ... నేను పుట్టి పెరిగిన పరిసరాలను ఇకపైన చుట్టం చూపుగా చూసి పోవాలి.. మళ్ళీ గుర్తొచ్చింది అమ్మ, వదిన కూడా ఒకప్పుడు ఇలాగే వచ్చిన వాళ్ళే కదా... వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా.. నేను అలాగే ఉంటాను అనే భరోసా వస్తుంది.. వచ్చింది..
పెళ్లి కుదరబోతున్న అమ్మాయి ఊహలు ఎలా ఉంటాయా అని అలోచించి, పరకాయ ప్రవేశం చేయడానికి ప్రయత్నించి రాసిన భావాలు.

బాగారాసారు....అక్కడక్కడా అచ్చుతప్పులున్నాయి చూసుకోండి.
ReplyDeleteచాలా థాంక్స్.. తప్పులు సరి చేసాను.. :)
Deleteబాగా రాసారు ..... ఆ కాలము నుండి ఈ కాలము దాక అందరు అమ్మాయిలు కనే కలలు అవే. పాటలు మాత్రమే వేరు. అప్పుడు "వస్తాడు నారాజు.. ఈరోజు... " , ఇప్పుడు "ఆరడుగులు ఉంటాడా , ఎదడుగులేస్తడా ??"... :)
ReplyDeleteథాంక్స్ .. :) అంతే కదా మరి... :)
Delete